Thursday, 9 January 2014

Atri Maharshi.....One of the foremost of the Sapta Rishisఅత్రి మహర్షి
       భ్రహ్మ తన సృష్టి కార్యక్రమంలో తనకు సహాయంగా ఎవరైన ఉంటే బాగుండునని ఆలోచించి  తన మనసునుండి ఒక దివ్య పురుషుని సృష్టించాడు. ఆ పురుషుడే అత్రి, అత్రి అనగా త్రిగుణాతీతుడు, సత్వ, రజో, తమో గుణాలని జయించినవాడు. ఆయన తండ్రి ఆదేశించినట్లు తపస్సు చేసి సహాయ పడాలని వెళ్లాడు. ఘోరంగా తపస్సు చేసి ఈ శరీరము పంచభూతములతో ఏర్పడినది, రక్త మాంసముల అస్తిపంజరము అనీ ఏనాటికైనా ఈ దేహము దహించపబడుతుందనీ, ఆత్మే నిత్యం అని తెలుసుకొని తపస్సువలన శాశ్వత స్థితి కలగాలని ఉగ్ర తపస్సు చేస్తున్నాడు. రోజు రోజుకూ సాధన ఎక్కువయి ఆయన కళ్లనుండి దివ్య తేజస్సు వెలువడి ఆ కాంతితో నేలా, ఆకాశం నిండిపోయింది. అన్ని పక్కలా దశదిశలన్నీ ఆ కాంతిని భరించలేక వదిలేశాయి. ఆ కాంతిని బ్రహ్మ మింగాడు. ఆ దృశ్యమును చూచిన దేవతలు బ్రహ్మను స్తుతించారు.  అప్పుడు బ్రహ్మ ఆ కాంతికి పురుషరూపం ఇస్తాను అత్రికి పెళ్లి అయాక అతని భార్యకు ఈ కాంతి చంద్రునిగా జన్మిస్తుందని చెప్పాడు. ఆ తేజమే క్షీరసాగరమధనంలో శశాంకుని కలుస్తుందని చెప్పి అంతర్ధానం అయ్యాడు.          ఆత్రి తపస్సు పూర్తి అయింది. కర్దముడు, దేవహూతి అనే దంపతులకు తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. వారిలో అనసూయ అనే ఆమెను అత్రికిచ్చి వివాహం చేశారు. అనసూయ తన పాతివ్రత్య మహిమతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పసిపాపలనుచేసి వారి కోరిక ప్రకారం నగ్నంగా ఆతిధ్యమిచ్చింది. లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మాతల కోరికతో ముగ్గురిని యధారూపులుగా మార్చింది. త్రిమూర్తులు సంతోషంతో తమ తమ అంశలతో ముగ్గురు పుత్రులు జన్మిస్తారని చెప్పి అంతర్ధానమయ్యారు.  తరువాత అత్రి అనసూయతో కలసి ఋష్యమూకపర్వతం మీద ఐదు సంవత్సరములు తపస్సు చేశారు. త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యాక సంతానం కావలని కోరారు. త్వరలో మీ కోరిక తీరుతుందని చెప్పి అంతర్ధానం అయ్యారు.
          కొంతకాలమునకు త్రిమూర్తులైన బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణువు అంశతో దత్తాత్రేయుడు, శివాంశతో దూర్వాసుడు జన్మించారు. అనసూయ దత్తాత్రేయునికి, దూర్వాసునికి జన్మనిచ్చింది. ఆత్రి కోరిక నెరవేరి పిల్లలు పెరిగి పెద్దవారవుచున్నారు. వారిని పెంచుటకు ధనము తెమ్మని ఆ ధనమును పృధు చక్రవర్తిని అడగమని అత్రిని పంపింది. ఆత్రి పృధు చక్రవర్తి దగ్గరకి బయలుదేరి వెళ్లేసరికి ఆ సమయంలో అయన అశ్వమేధయాగం చేస్తున్నారు. అక్కడ గౌతముడు కూడా ఉన్నాడు. యాగం పూర్తి అయ్యాక చక్రవర్తి బ్రాహ్మణులకి దక్షిణలు ఇచ్చి పంపుచున్నాడు. ఆత్రి మహర్షి పృధు చక్రవర్తిని కీర్తించాడు. విన్న గౌతముడు ఒక సామన్యుని యింతగా కీర్తించనక్కరలేదన్నాడు. వారిద్దరికీ సంవాదం పెరిగింది. చివరకు సనత్కుమారుడు అత్రిని బలపరచి నావిష్ణుః పృధ్వీపతిః విష్ణువుకానివాడు రాజు కాలేడు అందుకని ఆయనను కీర్తిచడం తప్పు లేదన్నాడు. మిగతావరందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గౌతముడు మౌనంగా ఉన్నాడు. పృధు చక్రవర్తి అత్రిని సత్కరించి ధన, కనక వస్తు వాహనాలను ఇచ్చి పంపాడు. అత్రి మహర్షి ఆ సంపదను కుమారులకిచ్చి భార్యతో తపస్సుకై అడవులకు వెళ్లిపోయాడు.
          ఒక సారి జంభాదిరాక్షసులతో దేవతలు యుద్ధము చెయాల్సి వచ్చింది. రాహువు దాటికి సూర్యచంద్రులు సోలిపోయారు. దీంతో లోకములు అంధకారమై పోయాయి.
          రాక్షసులు విజృంభించగా దేవతలు భయపడి అత్రిమహర్షిని శరణువేడారు. ఆయన వారికి అభయం ఇచ్చి తన దృష్టితో రాక్షసులను నశింపచేసాడు. దేవతలు రక్షింపబడి అత్రిని కీర్తించారు.
          ఆయన ఇలాంటి లోకోపకారాలు ఎన్నో చేశారు. ఆత్రి మహర్షి తన ఆశ్రమములో సీతారామలక్ష్మణులకు ఆతిధ్యమిచ్చి వారిని ఆశీర్వదించి పంపాడు. మిగతా మహర్షులు కోరగా అత్రి "అత్రిసంహిత"ను ఉపదేశించాడు. అత్రిమహర్షి పేర ఆత్రేయ ధర్మశాస్త్రము కలదు. దీనిలో తొమ్మిది అధ్యాయములు ఉండి ఎన్నో విషయాలు ఉన్నవి. అత్రి ఋషులకు దేవతలందరిలోనూ శ్రీమన్నారాయణుడే నిర్గుణుడు, నిర్వికారుడు, పరంజ్యోతి ఆయననే అర్చిస్తే మోక్షం కల్గునని చెప్పారు. ఆత్రి పేర లఘ్వత్రిస్మృతి, వృద్ధాత్రేయ స్మృతి అనే పుస్తకాలు కలవు. అత్రి సప్త ఋషులలో ఒకరు.

No comments:

Post a Comment