Sunday 26 January 2014

Brugu Maharshi



భృగు మహర్షి
          బ్రహ్మదేవుని హృదయమునుంచి జన్మించినవాడు భృగువు. ఈయన నవ బ్రహ్మలలో ఒకడుగా పేరు పొందాడు. కర్ధమ ప్రజాపతి కుమర్తె ఖ్యాతిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు దాత, విధాత అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఉశన అనే భార్యయందు శుక్రుడు; పులోమ ద్వారా చ్యవనుడు జన్మించారు. భృగుని భార్యను విష్ణువు సంహరించగా ఆ వార్త తెలిసి భృగువు కోపంతో శ్రీహరి అధర్మంగా నీవు ఒక స్త్రీని సంహరించావు, దాని ఫలితంగా భూలోకంలో పుట్టుచూ, గిట్టుచూ సుఖ దుఃఖములను పొందెదవుగాక అని శపించాడు.
          భృగుడు భార్యను మంత్రజలం చల్లి బ్రతికించుకున్నాడు. విష్ణువు భృగువు శాపంతో అదృశ్యమయినాడు.
          ఒకసారి మునులందరి మధ్య త్రిమూర్తులలో అధికుడెవరు అనే చర్చ వచ్చింది. ఆ విషయం తెలుసుకురమ్మని అందరూ భృగుమహర్షిని పంపారు.
          భృగువు ముందు బ్రహ్మ దగ్గరకి వెళ్లాడు. ఆయన సృష్టి క్రార్యక్రమంలో ఉండి చూచి చూడనట్లు ఉపేక్షించాడు. భృగువు కోపంలో పూజకి అనర్హుడివి అని బ్రహ్మను శపించి అక్కడ నుండి కైలాసంకు వెళ్లాడు. అక్కడ శివపార్వతులు నృత్యంచేస్తూ భృగువును చూచీ చూడనట్ల ఉన్నారు. శివుని కేవలం నీ లింగమునకు మాత్రమే అభిషేకం జరుగును అని శపించి వైకుంఠంకు వెళ్లడు. అక్కడ కూడా విష్ణువు కళ్లు మూసుకొని తనను గౌరవించలేదని తన కాలితో తన్నాడు. అప్పుడు విష్ణువు వినయంతో భృగువుకు అతిధి మర్యాదలు చేసి కాళ్లు నొక్కుతూ ఆయన పాదంలో ఉన్న కన్నును నొక్కివేశాడు. ఆయన అహంకారం పోయి విష్ణువుని స్తుతించాడు. అందరిలోకి విష్ణువే గొప్ప అని నిర్ణయించి మునులకు తెలియచేశాడు. అందరూ విష్ణువుని పూజించటం మొదలుపెట్టారు.
          యవనాశ్వడనే రాజు పిల్లలు లేక బాధపడి భృగుమహర్షి ఆశ్రమంకు వచ్చాడు. భృగుమహర్షి ఆ రాజుతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు. మంత్రపూరితమైన జలము కలశముతో సహా రాజుకిచ్చి కాపాడమని ఇచ్చాడు. ఒక రాత్రివేళ దాహంవేసి రాజు ఆ నీరు త్రాగాడు.  ఆది తెలుసుకొని భృగుమహర్షి రాజా నీ భార్య త్రాగవలసిన నీరు నువ్వు తాగావు. నీవే గర్భం ధరించి పుత్రుని కంటావు అంతా దైవలీల అని రాజును పంపాడు. రాజు గర్భం ధరించి చాలా సంవత్సరాలకు అతని ఎడమ తొడ భాగం నుంచి ఒక బాలుడు జన్మించాడు. అతడే మాంధాత షట్చక్రవర్తులలో ఒకడుగా పేరుగాంచాడు.
          భృగుమహర్షి కైలాసపర్వతం మీద కుటీరం నిర్మించుకొని తపస్సు చేయసాగాడు. ఒక రోజున పులిముఖం కల్గిన అతను భార్యతో కలసి వచ్చి మహర్షి నేను సుముఖుడ్నే విద్యాధరుడిని, స్వర్గలోకమునకు వెళ్లివస్తుండగా నాకు ఈ పులిముఖం వచ్చింది, ఇది పోగొట్టమని ప్రార్థించాడు. భృగువు దివ్యదృష్టితో చూచి మాఘమాసంలో నదీస్నానం చెయ్యి మాములుగా అవుతావు అని చెప్పారు. ఆతను మాఘస్నానం చేసి మామూలు ముఖం పొంది భృగువుకు నమస్కరించి వెళ్లాడు.
          కార్తవీర్యార్జునితో యుద్ధంలో జమదగ్ని మరణించగా రేణుక సహగమనంకు సిద్ధం అయింది. భృగుమహర్షి తన తపోమహిమతో ఆమెను బ్రతికించాడు. భృగువు చెప్పినట్లు శివుని గురించి తపస్సు చేసి పరశురాముడు భార్గవాస్త్రం‍ను సంపాదించుకున్నాడు. భృగుమహర్షి  జ్యోతిశాస్త్రమును రచించాడు. ఆ గ్రంథమే భృగు సూత్రములనే పేర ప్రసిద్ధికెక్కింది. ఈయన స్మృతి ఒకటి ఉంది. ఈయన ధర్మ ప్రవక్తగా విలసిల్లాడు. తపశ్శక్తిచే బ్రహ్మత్వాన్ని పొందాడు.
          ఈయన సత్యంగా ఉండటం వల్ల శరీరక, మానసిక దుఃఖములు దూరం అవుతాయని చెప్పేవారు.
          ఆనందమే బ్రహ్మం అని అదే అత్మస్వరూపం అని బోధించేవారు.

No comments:

Post a Comment