Saturday 18 January 2014

Maitreya Maharshi


మైత్రేయ మహర్షి భూమిపై నిలిచిన గొప్ప యోగీశ్వరుడు. ఆయన దివ్య శరీర ధారి, నిర్మలమూర్తి, దర్శనమాత్రంతో సకల మోహములనుండి విముక్తికలిగించు మోహనమూర్తి. సాటి యొగులకు పూర్ణానంద స్థితిని నిలిపి భూమిపై జీవులకు యోగమార్గము ఉపదేశించుటకు వచ్చిన పూర్ణస్వరూపుడు. సిద్ధి, బుద్ధి, జ్ఞానము ఆయనకు కరతలామలకము. జ్ఞానము బోధించి యోగమును అభ్యసింపచేసి మనలను ముక్తులను చేసే యోగేశ్వరుడాయన.
          భక్తి, జ్ఞాన, వైరాగ్యములను యాగం ద్వారా పటిష్టముచేసి నిష్కామకర్మమార్గమున వేలాది జీవులను ఉద్ధరించిన కర్మనిష్టుడు. నిరంతరం పద్మాసనంన కూర్చుండి అష్టాంగ యోగమును అభ్యసించుచుండును. మనస్సు ఎప్పుడూ శ్రీ కృష్ణుని పాదపద్మములందు లీనమై ఉండును. ఆయన శరీరము పలుచనిదై కాంతికిరణములను ప్రసరిస్తూ ఉంటుంది. మైత్రేయమహర్షి కాశీరాజు దివోదాసుని కుమారుడు. వీరు చంద్రవంశమునకు చెందినవారు. వీరి మూలపురుషుడు ధన్వంతరి క్షీరసాగరమధనంలో పుట్టినవాడు. ఆయన తన సహపాటి భరద్వాజుని కూడి ఆయుర్వేదశాస్త్రము కనిపెట్టి లోకమునకు మేలుచేశారు.
          మైత్రేయుడు తండ్రి వద్ద విద్యాభ్యాసం పూర్తి అయ్యాక ఆయన ఆజ్ఞ తీసుకొని హిమాలయాలకువెళ్లి పరాశరమహర్షికి శిష్యుడై దేహమునకు తనకుగల బంధమును శాశ్వతంగా తెంచుకొని, దివ్య దేహములందు సంచరించటం అభ్యాసం చేశాడు. శ్రీ కృషునిచే కలియుగాంతం వరకూ జగద్గురువుగా నియమింపపడ్డ సిద్ధ పురుషుడు. ధర్మం అతని స్వరూపం కాబట్టి సమస్త జీవులకు ప్రేమ, కరుణ నిత్యమూ తన హస్తములనుండి ప్రసరింప చేయుచుండును. ఆయన సంచరించిన ప్రదేశములు పుణ్యతీర్థములై ఉన్నాయి. ఆయన కలాపగుహలలో ఉంటూ దైవకార్యములు చిరకాలం చేయుటకు నిశ్చయించుకున్నాడు. హిమవత్ పర్వత గర్భమున లీనమై పోయిన శంబల గ్రామము మరువు, దేవాపి మహర్షుల సాయంతో పునరుద్ధరించారు. విష్ణుపురాణము అధ్యయనం మైత్రేయునకి యాబైఏళ్లు పట్టింది. మొదటి పది ఏళ్లు రావిచెట్టు క్రింద జరిగింది. తరువాత పది ఏళ్లు బరదికాశ్రమంలో జరిగింది. తర్వాత ముప్పై సంవత్సరాలు ప్రయాగలోని కృష్ణద్వీపంలో జరిగింది. ఒక పురాణము ఇన్ని ఏళ్లు చెప్పటం, వినటం ఆ గురుశిష్యులకే చెల్లింది. వారికి వారేసాటి.
          మైత్రేయ పరాశర సంవాదమే విష్ణు పురాణము. దీనినే పరాశరుని కుమారుడు వ్యాసమహర్షి తరువాత కాలంలో పదునెనిమిది పురాణాలుగా వ్రాశారు. కలియుగంలో మైత్రేయ, విదుర సంవాదముగా భాగవతం ఏర్పడింది. రాబోవుతరం వారిని పుణ్య పురుషులుగా తయారుచేసిన వారిలో మైత్రేయుడు ముఖ్యుడు.
          సూర్యవంశమువాడగు మరువు చంద్రవంశమువాడగు దేవాపి అక్రూరుడు, సాందీపుడు, బృహస్పతి మొదలైన వారిని శ్రీకృష్ణుడు ఎన్నుకున్నాడు. శ్రీకృష్ణుడు సకల జీవుల హృదయాలలో నెమ్మదిగా నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కోలిపి వారిని వెలుగుదారిలో దివ్య స్పర్శ నిచ్చి నడిపించదలిచాడు.
          అట్టి జీవులకు ఎన్ని జన్మలెత్తినా కలిప్రభావం ఉండదు. ఈ విషయంలో ఒక సిద్ధ పురుషుని సూక్ష్మ శరీరమును వినియోగించదలచి అందుకు మైత్రేయ మహర్షిని తన సాధనముగా ఎన్నుకున్నారు.
          శ్రీ కృష్ణుడు వేణునాదం జీవులను చైతన్య పరచుట అనగా మానవుల వెన్నుపూస దండమై మురళిగా, మురళికి క్రింద ఉన్న ఆరు రంధ్రములు సాధకునిలో నిద్రాణమైన ఆరుచక్రములుగా, పైన ఉన్న రంధ్రము సహస్రారముగా చేసి వేణునాదమును జీవులలోని జడమైన కుండలినీ శక్తిని చైతన్య పరచి, క్రిందనున్న ఆరుచక్రాలు దాటి సహస్రారమును చేరే యోగసాధకులుగా మనలని మార్చే నాదమే శ్రీ కృష్ణుని వేణునాదము. ఆ స్థితిని చేరిన సాధకుని కలి ప్రభావం ఏమి చెయ్యలేదు.
          ఈ కలియుగమున యోగసాధకులుగా మరచు వేణునాదముతో చైతన్యము కలిగేవారుగా మార్చుటకు మైత్రేయ మహర్షి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
          ఈ మార్గములో తనకు తోడుగా దేవాపి, మరువు మహర్షులను ఎన్నుకున్నారు మైత్రేయమహర్షి. వీరి ముగ్గురి మహర్షుల భుజస్కందము ఆధారంగా అద్భుతమైన తేజోమయ త్రిభుజమును ఏర్పరిచారు. మైత్రేయమహర్షి కలియుగాంతం వరకూ భూమిని కాపాడుచున్నాడు. ఈ యుగములో దివ్యప్రణాళికలో జగద్గురువై నిలచారు.

No comments:

Post a Comment