Saturday, 1 February 2014

Chyavana Maharshచ్యవన మహర్షి
          భృగువు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు పులోమ. వారికి ఒక కుమారుడు పుట్టాడు. చ్యవనుడు అనే పేరు పెట్టి పెంచారు.  పెద్దవాడయ్యాక ఉపనయనం చేశారు. ఆ తరువాత తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్లి ఒక సరస్సువద్ద వేల సంవత్సరములు తపస్సు చేసి వృద్ధుడైనాడు. అతని శరీరము చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి.
          ఒక  రోజున సంయాతి అనే రాజు తన భార్యతోనూ, కూతురు సుకన్యతోనూ ఆ సరోవరంలో జలక్రీడలకు వచ్చారు. సుకన్య అపురూపమైన సౌందర్యవతి, చెలికత్తెలతో కలసి తిరుగుతూ చ్యవన మహర్షి ఉన్న పుట్ట దగ్గరకు వచ్చి ఆయన కళ్లు మెరవటం చూచి ఏవో పురుగులనుకొని పొడిచింది. ఆ మహర్షి అందరికీ మలమూత్రములు రాకుండా చేశారు.  ఆ రాజు బయపడి మహర్శి వద్దకు వచ్చి క్షమించండి నా కూతురు మీ కళ్లు పురుగులని భావించి పొడిచిందట అని ప్రాధేయపడ్డాడు.
          చ్యవన మహర్షి అప్పుడు నీ కూతురు వల్ల నా కళ్లు కనిపించటం లేదు. అందుకని ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. రాజుగారు అంగీకరించి సుకన్యా చ్యవన మహర్షికి వివాహం వైభవంగా చేశాడు. తన కూతురిని అక్కడ వదలి రాజుగారు వెళ్లిపోయారు. సుకన్య వృద్ధుడయిన భర్తకి సేవలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నది.
          సుకన్య అందగత్తె అని తెలిసి అశ్వనీ కుమారులు ఆశ్రమంకు వచ్చి ఆమెను పరీక్షించాలని సుందరీ ఈ వృద్ధునితో నీవేమి సుఖపడతావు. నీవు అంగీకరిస్తే ఒక యౌవనంలో ఉన్న అందమైన భర్తను తెస్తాము అని చెప్పగా విని సుకన్య చ్యవనుడే తన భర్త తనే నా సర్వస్వం అని చెప్పింది. విన్నాక అశ్వనీ దేవతలు చ్యవనునితో కలసి ఆక్కడ ఉన్న సరోవరంలోకి దిగి లేచారు. ముగ్గురూ ఒకే రుపం‍లో ఉన్నా సుకన్య తన భర్తను గుర్తుపట్టింది.
          అశ్వనీ దేవతలు సంతోషించి చ్యవనుని యౌవనవంతుడిగా చేసి వెళ్లిపోయారు. చ్యవన మహర్షి అశ్వనీ దేవతలకి ప్రత్యుపకారం చేయాలని యజ్ఞంలో సోమపానార్హత కలగచేస్తానని మాటయిచ్చారు. మామగారితో యజ్ఞం చేయించి ఇంద్రాది దేవతలతో పాటూ అశ్వనీదేవతలకు సోమమీయబోతే ఇంద్రుడు వారికి ఆ అర్హత లేదని పలికాడు. అయినా వారితో వాదించి చ్యవనుడు వారికి సోమపానార్హత కలగచేశాడు.   
          ఇంద్రునికి కోపం వచ్చి తన వజ్రాయుధంతో చ్యవనుని చంపబోయాడు. ఆ మునికూడా తన తపోశక్తితో ఒక రాక్షసుడిని సృష్టించి ఇంద్రునిపైకి పంపాడు. రాక్షసుడు ఇంద్రుని చంపబోగా భయపడి చ్యవనుని కాళ్లుపట్టుకొని శరణువేడి అశవీ దేవతలకి సోమపానార్హత ఉందని ఒప్పుకున్నాడు. అశ్వనీ దేవతలు చ్యవనుని అభినందించి వెళ్లారు. సుకన్య, చ్యవనులు హాయిగా ఉంటున్నారు.
          కొంతకాలానికి సుకన్యకు దధీచి, ప్రమతి, అప్రవాసు అనే ముగ్గురు పుత్రులు కలిగారు. చ్యవన మహర్షి దయవల్ల సహుషుడనే రాజు ఇందుడైనాడు. కుశికుడు అనే రాజును బాధలు పెట్టి పరాభవించగా ఆ రాజు చ్యవనుని వలన ఆ ధాటికి ఆగగల్గాడు. అతని భార్య కూడా ధైర్యంగా నిలబడింది. ఆ దంపతులను చ్యవనుడు అశీర్వదించి నీ వంశము వృద్ధి అవుతుందని, పరశురాముడు, విశ్వామిత్రుని వంటివారు నీకు పుడతారని చెప్పారు.
          చ్యవన మహర్షి ఒక రోజు నర్మదానదిలో స్నానమాడుతుండగా ఒక పెద్ద పాము ఆయనను పాతాళ లోకంకు తీసుకెళ్లి వదిలింది. అప్పుడు ప్రహ్లాదుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు.
          ఆయన చ్యవనుని గౌరవంగా ఆహ్వానించి పూజించాడు. చ్యవన మహర్షి ద్వారా చాలా విషయాలు తెలుసుకొని తీర్ధయాత్రలకు సపరివారంగా బయలుదేరాడు. మధుడనే రాక్షసుడు శివునికోసం తపస్సు చేసి మెప్పించి ఒక శూలమును సంపాదించాడు. శూలము చేతిలో ఉన్నంతవరకూ వాడిని ఎవరూ జయించలేరు, చంపలేరు. వాడు మునులను భాధిస్తూ ఉంటే తట్టుకోలేక చ్యవనుని ఉపాయం అడిగితే శూలం చేతిలో లేనప్పుడు చంపే ప్రయత్నం చేయమన్నాడు.
          శ్రీరాముని సోదరుడు శత్రుఘ్నుడు అతని చేతిలో శూలం లేనప్పుడు చంపాడు. ఋషులు ఆనందించారు. చ్యవన మహర్షి లోకోపకారం పొందే పనులు చాలా చేశారు.

No comments:

Post a Comment