Wednesday, 2 April 2014

Goutama Maharshiగౌతమ మహర్షి
          గౌతముడు బ్రహ్మ మానసపుత్రులలో ఒకడు. ఈయన గౌతమ వంశంలో జన్మించి గౌతమ మహర్షిగా పేరు ప్రతిష్టలు పొందారు. వెనుకటి కాలంలో క్షీరసాగర మధనం వేళ శ్రీహరి మోహినీరూపం ధరించగా చూచిన దేవతలందరూ బ్రహ్మ సృష్టిని అవహేళన చేశారు. అందుకని బ్రహ్మ అఖిలలోకాలలోనూ ఆశ్చర్యపోయేటటువంటి అందమైన అహల్యను సృష్టించాడు. అహల్యను గౌతమునికి సపర్యలు చేయమని ఆదేశించాడు. ఆమె అలాగే చేసింది. అహల్యకు యుక్త వయస్సు వచ్చాక ఆమె రూపం చూచి ఇంద్రుడు మొదలగు వారందరూ ముగ్దులైనారు.
          బ్రహ్మ అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహం చేద్దాం అని అనుకున్నాడు. దేవతలు నాకిచ్చి చేయమని నాకిచ్చి చేయమని ఎవరికి వారే వచ్చారు. ఆమె సౌందర్యమే అందుకు కారణం, ఈ సమస్యను ఎలా తీర్చాలా అని ఆలోచించి బ్రహ్మ ఎవరైతే ముందుగా భూప్రదిక్షణ చేసి వస్తారో వారికి అహల్యనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు. విన్న ఇంద్రాది దేవతలు ప్రదిక్షణకు బయలుదేరారు. ఈ లోపు గౌతముడు రెండు ముఖాలు కలిగిన గోవు చుట్టూ ప్రదిక్షణ చెస్తే భూప్రదిక్షణ చేసినట్లేనని చెప్పగా అది ధర్మసమ్మతమేనని బ్రహ్మ అహల్య గౌతముల కళ్యాణం వైభవంగా జరిపించాడు. తిరిగివచ్చిన దేవతలు చేసేదిలేక నూతన దంపతులను దీవించి వెళ్లారు. అహల్యను వెంటబెట్టుకొని గౌతముడు దండకారణ్య పర్వతమునకు చేరువలో నివసించసాగారు.
          చాలాకాలం బ్రహ్మను గురించి తపస్సుచేసి ఆయన ప్రత్యక్షమయ్యాక ‘నే చల్లిన విత్తనములు క్షణంలో పరిపక్వం" అయ్యే వరము కోరాడు. విధాత సరేనని చెప్పి అంతర్ధానమయ్యారు. తర్వాత ఆయన భార్యతో కలసి శతశృంగగిరికి వెళ్లి ఆశ్రమం నిర్మించుకొని ఉంటూ వచ్చిన అతిథులను పూజించి వారికి సుష్టుగా భోజనం పెడ్తూ సుఖంగా జీవిస్తున్నారు. అహల్య భర్తకు అనుగుణంగా ఉండేది. ఆ ఆశ్రమం సస్యశ్యామలమై ఉండేది. కొన్ని రోజులకు కరువు ఏర్పడింది. ఎక్కడా పంటలు లేక ఆకలిబాధతో ప్రజలు చనిపోతున్నారు.
          వర ప్రభావంతో గౌతముని భూములు మాత్రం పండుచున్నాయి. ఇది తెలిసినవారు మాత్రం గౌతమునికి అతిథులుగా వచ్చేవారు. ఈ విధంగా గౌతముని కీర్తి దశ దిశలా వ్యాపించింది. భూ మండలంలో ప్రజలు కుటుంబాలతో గౌతముని ఆశ్రమంలోనే ఉండేవారు. ఇంద్రాదులు గౌతముని కీర్తించారు. విఘ్నేశ్వరుడు బ్రాహ్మణరూపంలో వచ్చి పరీక్షీంచి చేసేదిలేక తనుకూడా అక్కడే ఉన్నాడు.
          తన తల్లి పార్వతికి బాధలేకుండా చేస్తానని అన్న వినాయకుడు గంగను భూలోకంలోకి పంపాలనే ప్రయత్నంలో ఆ పని గౌతముని వల్ల తప్ప మరెవరివల్లా కాదని భావించాడు. అనుకోవటమేకాక వెంటనే తల్లి చెలికత్తెను మాయాగోవుగా చేసి గౌతముని పొలం మేయమనీ, ఆ మహర్షి ఏంచేసినా వెంటనే చనిపొమ్మని చెప్పాడు. ఆవు చేలో మేస్తుండటం చూచి గౌతముడు గడ్డిపరకతో ఆదరించాడు. అంతే గోవు చనిపోయింది. గౌతముడు గోహత్య చేశాడు ఇక ఇక్కడ ఉంటే పాపం అని అందరూ వెళ్లిపోయారు. ఈ పాపం ఎలా పోతుందని గణపతిని అడిగాడు గౌతముడు.
          శివుని జటా జూటంలోని గంగ భూమి మీదకు ప్రవహించి ఆ గోవు తడచిన పాపం పోతుందని చెప్పాడు. శివునికోసం తపస్సు చేసి మెప్పించి భూమి మీదకు గంగను తెప్పించాడు గౌతముడు. మాయాగోవు బ్రతికింది.
          గంగకు “గౌతమి" అనే పేరు వచ్చింది. అహల్య తనకు పుత్రుడు కావాలని భర్తను కోరింది. అహల్య గర్భవతి అయి “శతానందుడు" అనే పుత్రుడుని కన్నది. తరువాత అంజని అనే కుమార్తెను కన్నది. అహల్యపై ఇంద్రుని కామదృష్టి పోలేదు. ఆ కారణంతో ఒక రోజు రాత్రి కోడి రూపం దాల్చి కొక్కురోకో అని కూయగా తెల్లవారిందని అనుకొని గౌతముడు స్నానానికి నదికి వెళ్లాడు. ఇంద్రుడు గౌతముని రూపు ధరించి అహల్యను పొందాడు. ఆ సమయంలో గౌతముడు వచ్చి చూచి అహల్యను శిలయై పడి ఉండమని, ఇంద్రుని ఒళ్లంతా కళ్లతో ఉండమని శపించాడు. గౌతముడు ఈ లోకమునకు ధర్మసూత్రములు, స్మృతి, న్యాయ, తర్క, సంహితలు వ్రాసి అందించారు. సప్త  ఋషులలో ఈయన ఒకరు.        

1 comment:

 1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

  మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

  సాయి రామ్ సేవక బృందం,
  తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
  సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

  ReplyDelete