Saturday, 1 February 2014

Chyavana Maharsh



చ్యవన మహర్షి
          భృగువు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు పులోమ. వారికి ఒక కుమారుడు పుట్టాడు. చ్యవనుడు అనే పేరు పెట్టి పెంచారు.  పెద్దవాడయ్యాక ఉపనయనం చేశారు. ఆ తరువాత తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్లి ఒక సరస్సువద్ద వేల సంవత్సరములు తపస్సు చేసి వృద్ధుడైనాడు. అతని శరీరము చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి.
          ఒక  రోజున సంయాతి అనే రాజు తన భార్యతోనూ, కూతురు సుకన్యతోనూ ఆ సరోవరంలో జలక్రీడలకు వచ్చారు. సుకన్య అపురూపమైన సౌందర్యవతి, చెలికత్తెలతో కలసి తిరుగుతూ చ్యవన మహర్షి ఉన్న పుట్ట దగ్గరకు వచ్చి ఆయన కళ్లు మెరవటం చూచి ఏవో పురుగులనుకొని పొడిచింది. ఆ మహర్షి అందరికీ మలమూత్రములు రాకుండా చేశారు.  ఆ రాజు బయపడి మహర్శి వద్దకు వచ్చి క్షమించండి నా కూతురు మీ కళ్లు పురుగులని భావించి పొడిచిందట అని ప్రాధేయపడ్డాడు.
          చ్యవన మహర్షి అప్పుడు నీ కూతురు వల్ల నా కళ్లు కనిపించటం లేదు. అందుకని ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. రాజుగారు అంగీకరించి సుకన్యా చ్యవన మహర్షికి వివాహం వైభవంగా చేశాడు. తన కూతురిని అక్కడ వదలి రాజుగారు వెళ్లిపోయారు. సుకన్య వృద్ధుడయిన భర్తకి సేవలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నది.
          సుకన్య అందగత్తె అని తెలిసి అశ్వనీ కుమారులు ఆశ్రమంకు వచ్చి ఆమెను పరీక్షించాలని సుందరీ ఈ వృద్ధునితో నీవేమి సుఖపడతావు. నీవు అంగీకరిస్తే ఒక యౌవనంలో ఉన్న అందమైన భర్తను తెస్తాము అని చెప్పగా విని సుకన్య చ్యవనుడే తన భర్త తనే నా సర్వస్వం అని చెప్పింది. విన్నాక అశ్వనీ దేవతలు చ్యవనునితో కలసి ఆక్కడ ఉన్న సరోవరంలోకి దిగి లేచారు. ముగ్గురూ ఒకే రుపం‍లో ఉన్నా సుకన్య తన భర్తను గుర్తుపట్టింది.
          అశ్వనీ దేవతలు సంతోషించి చ్యవనుని యౌవనవంతుడిగా చేసి వెళ్లిపోయారు. చ్యవన మహర్షి అశ్వనీ దేవతలకి ప్రత్యుపకారం చేయాలని యజ్ఞంలో సోమపానార్హత కలగచేస్తానని మాటయిచ్చారు. మామగారితో యజ్ఞం చేయించి ఇంద్రాది దేవతలతో పాటూ అశ్వనీదేవతలకు సోమమీయబోతే ఇంద్రుడు వారికి ఆ అర్హత లేదని పలికాడు. అయినా వారితో వాదించి చ్యవనుడు వారికి సోమపానార్హత కలగచేశాడు.   
          ఇంద్రునికి కోపం వచ్చి తన వజ్రాయుధంతో చ్యవనుని చంపబోయాడు. ఆ మునికూడా తన తపోశక్తితో ఒక రాక్షసుడిని సృష్టించి ఇంద్రునిపైకి పంపాడు. రాక్షసుడు ఇంద్రుని చంపబోగా భయపడి చ్యవనుని కాళ్లుపట్టుకొని శరణువేడి అశవీ దేవతలకి సోమపానార్హత ఉందని ఒప్పుకున్నాడు. అశ్వనీ దేవతలు చ్యవనుని అభినందించి వెళ్లారు. సుకన్య, చ్యవనులు హాయిగా ఉంటున్నారు.
          కొంతకాలానికి సుకన్యకు దధీచి, ప్రమతి, అప్రవాసు అనే ముగ్గురు పుత్రులు కలిగారు. చ్యవన మహర్షి దయవల్ల సహుషుడనే రాజు ఇందుడైనాడు. కుశికుడు అనే రాజును బాధలు పెట్టి పరాభవించగా ఆ రాజు చ్యవనుని వలన ఆ ధాటికి ఆగగల్గాడు. అతని భార్య కూడా ధైర్యంగా నిలబడింది. ఆ దంపతులను చ్యవనుడు అశీర్వదించి నీ వంశము వృద్ధి అవుతుందని, పరశురాముడు, విశ్వామిత్రుని వంటివారు నీకు పుడతారని చెప్పారు.
          చ్యవన మహర్షి ఒక రోజు నర్మదానదిలో స్నానమాడుతుండగా ఒక పెద్ద పాము ఆయనను పాతాళ లోకంకు తీసుకెళ్లి వదిలింది. అప్పుడు ప్రహ్లాదుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు.
          ఆయన చ్యవనుని గౌరవంగా ఆహ్వానించి పూజించాడు. చ్యవన మహర్షి ద్వారా చాలా విషయాలు తెలుసుకొని తీర్ధయాత్రలకు సపరివారంగా బయలుదేరాడు. మధుడనే రాక్షసుడు శివునికోసం తపస్సు చేసి మెప్పించి ఒక శూలమును సంపాదించాడు. శూలము చేతిలో ఉన్నంతవరకూ వాడిని ఎవరూ జయించలేరు, చంపలేరు. వాడు మునులను భాధిస్తూ ఉంటే తట్టుకోలేక చ్యవనుని ఉపాయం అడిగితే శూలం చేతిలో లేనప్పుడు చంపే ప్రయత్నం చేయమన్నాడు.
          శ్రీరాముని సోదరుడు శత్రుఘ్నుడు అతని చేతిలో శూలం లేనప్పుడు చంపాడు. ఋషులు ఆనందించారు. చ్యవన మహర్షి లోకోపకారం పొందే పనులు చాలా చేశారు.

Sunday, 26 January 2014

Brugu Maharshi



భృగు మహర్షి
          బ్రహ్మదేవుని హృదయమునుంచి జన్మించినవాడు భృగువు. ఈయన నవ బ్రహ్మలలో ఒకడుగా పేరు పొందాడు. కర్ధమ ప్రజాపతి కుమర్తె ఖ్యాతిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు దాత, విధాత అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఉశన అనే భార్యయందు శుక్రుడు; పులోమ ద్వారా చ్యవనుడు జన్మించారు. భృగుని భార్యను విష్ణువు సంహరించగా ఆ వార్త తెలిసి భృగువు కోపంతో శ్రీహరి అధర్మంగా నీవు ఒక స్త్రీని సంహరించావు, దాని ఫలితంగా భూలోకంలో పుట్టుచూ, గిట్టుచూ సుఖ దుఃఖములను పొందెదవుగాక అని శపించాడు.
          భృగుడు భార్యను మంత్రజలం చల్లి బ్రతికించుకున్నాడు. విష్ణువు భృగువు శాపంతో అదృశ్యమయినాడు.
          ఒకసారి మునులందరి మధ్య త్రిమూర్తులలో అధికుడెవరు అనే చర్చ వచ్చింది. ఆ విషయం తెలుసుకురమ్మని అందరూ భృగుమహర్షిని పంపారు.
          భృగువు ముందు బ్రహ్మ దగ్గరకి వెళ్లాడు. ఆయన సృష్టి క్రార్యక్రమంలో ఉండి చూచి చూడనట్లు ఉపేక్షించాడు. భృగువు కోపంలో పూజకి అనర్హుడివి అని బ్రహ్మను శపించి అక్కడ నుండి కైలాసంకు వెళ్లాడు. అక్కడ శివపార్వతులు నృత్యంచేస్తూ భృగువును చూచీ చూడనట్ల ఉన్నారు. శివుని కేవలం నీ లింగమునకు మాత్రమే అభిషేకం జరుగును అని శపించి వైకుంఠంకు వెళ్లడు. అక్కడ కూడా విష్ణువు కళ్లు మూసుకొని తనను గౌరవించలేదని తన కాలితో తన్నాడు. అప్పుడు విష్ణువు వినయంతో భృగువుకు అతిధి మర్యాదలు చేసి కాళ్లు నొక్కుతూ ఆయన పాదంలో ఉన్న కన్నును నొక్కివేశాడు. ఆయన అహంకారం పోయి విష్ణువుని స్తుతించాడు. అందరిలోకి విష్ణువే గొప్ప అని నిర్ణయించి మునులకు తెలియచేశాడు. అందరూ విష్ణువుని పూజించటం మొదలుపెట్టారు.
          యవనాశ్వడనే రాజు పిల్లలు లేక బాధపడి భృగుమహర్షి ఆశ్రమంకు వచ్చాడు. భృగుమహర్షి ఆ రాజుతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు. మంత్రపూరితమైన జలము కలశముతో సహా రాజుకిచ్చి కాపాడమని ఇచ్చాడు. ఒక రాత్రివేళ దాహంవేసి రాజు ఆ నీరు త్రాగాడు.  ఆది తెలుసుకొని భృగుమహర్షి రాజా నీ భార్య త్రాగవలసిన నీరు నువ్వు తాగావు. నీవే గర్భం ధరించి పుత్రుని కంటావు అంతా దైవలీల అని రాజును పంపాడు. రాజు గర్భం ధరించి చాలా సంవత్సరాలకు అతని ఎడమ తొడ భాగం నుంచి ఒక బాలుడు జన్మించాడు. అతడే మాంధాత షట్చక్రవర్తులలో ఒకడుగా పేరుగాంచాడు.
          భృగుమహర్షి కైలాసపర్వతం మీద కుటీరం నిర్మించుకొని తపస్సు చేయసాగాడు. ఒక రోజున పులిముఖం కల్గిన అతను భార్యతో కలసి వచ్చి మహర్షి నేను సుముఖుడ్నే విద్యాధరుడిని, స్వర్గలోకమునకు వెళ్లివస్తుండగా నాకు ఈ పులిముఖం వచ్చింది, ఇది పోగొట్టమని ప్రార్థించాడు. భృగువు దివ్యదృష్టితో చూచి మాఘమాసంలో నదీస్నానం చెయ్యి మాములుగా అవుతావు అని చెప్పారు. ఆతను మాఘస్నానం చేసి మామూలు ముఖం పొంది భృగువుకు నమస్కరించి వెళ్లాడు.
          కార్తవీర్యార్జునితో యుద్ధంలో జమదగ్ని మరణించగా రేణుక సహగమనంకు సిద్ధం అయింది. భృగుమహర్షి తన తపోమహిమతో ఆమెను బ్రతికించాడు. భృగువు చెప్పినట్లు శివుని గురించి తపస్సు చేసి పరశురాముడు భార్గవాస్త్రం‍ను సంపాదించుకున్నాడు. భృగుమహర్షి  జ్యోతిశాస్త్రమును రచించాడు. ఆ గ్రంథమే భృగు సూత్రములనే పేర ప్రసిద్ధికెక్కింది. ఈయన స్మృతి ఒకటి ఉంది. ఈయన ధర్మ ప్రవక్తగా విలసిల్లాడు. తపశ్శక్తిచే బ్రహ్మత్వాన్ని పొందాడు.
          ఈయన సత్యంగా ఉండటం వల్ల శరీరక, మానసిక దుఃఖములు దూరం అవుతాయని చెప్పేవారు.
          ఆనందమే బ్రహ్మం అని అదే అత్మస్వరూపం అని బోధించేవారు.

Saturday, 25 January 2014

Pulastya Maharshi



పులస్త్య మహర్షి
          విష్ణువు నాభినుంచ్ఛి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ కుడి చెవినుంచి పులస్త్యుడు ఉద్భవించాడు. ఆయన చిన్నప్పటి నుంచి సత్వగుణంలో ఉండి తపస్సు చేసుకొనేవాడు. తపశ్శక్తితో అపర శివుడుగా కన్పించేవాడు. యుక్తవయస్సు రాగానే కర్ధమ ప్రజాపతి కుమార్తె హవిర్భువును వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు కాని అతను మరణించాడు.
        తరువాత కొన్నాళ్లకు సర్వసంగ పరిత్యాగియై పులస్త్యుడు తృణబిందుని ఆశ్రమంకు వెళ్లి అక్కడ తపస్సు చేయసాగాడు.  అక్కడ ఖౌచర, గంధర్వ కిన్నెరాంగులు వచ్చి విచ్చలవిడిగా విహరిస్తున్నారు.  దాంతొ ఆయన తపస్సుకి భంగం కలిగి వారిని మరో ప్రదేశంకు వెళ్లమని చెప్పినా వినలేదు.  ఆ భాద భరించలేక పులస్త్యుడు ఓ కన్యలారా ఈ రోజు నుంచి నా కంటబడినవారు గర్భవతులౌతారు అని చెప్పాడు.
          అది విని వారు భయంతో వెళ్లిపోయారు. ఒక రోజున తృణబిందుడనే రాజు కుమార్తె తన చెలికత్తెలతో వన విహారం చేస్తూ తెలియక పులస్త్యుని వద్దకు వచ్చి ఆయన ముఖం చూచింది.
          ఆమె గర్భవతి అయింది. ఆశ్చర్యపడి నేను అవివాహితను, అందరూ నవ్వుతారు ఇది నా తండ్రికి అపకీర్తి,  నేనిచ్చటకు వచ్చిన వేళావిశేషమా అని పలురకాలుగా ఆలోచించి తండ్రి దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పింది. ఆ రాజర్షి దివ్యదృష్టితో చూచి కుమార్తెను తీసుకొని పులస్త్యుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పి వివాహం చేసుకోమన్నాడు.
          పులస్త్యుడు ఆమెను వివాహం చేసికొని అన్యోన్యంగా జీవిస్తున్నారు. కొన్నాళ్లకు ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డకి విశ్వవసు అనిపేరు పెట్టి పెంచుకున్నారు. అతనికి యుక్తవయస్సు రాగానే దేవకర్ణి అనే ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ద్వారా కుబేరుని కన్నాడు.
          పులస్త్యుడు కైకసి అనే కన్యను వివాహం చేసుకొని ఆమె ద్వారా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలను కన్నాడు. వారు పెద్దవారు అయ్యాక రావణుడు బలగర్వంతో కార్తవీర్యార్జునితో యుద్ధంచేసి ఓడిపోయాడు. అతనిని ఖైదు చేశారనే వార్త తెలిసి పులస్త్యుడు వెంటనే వెళ్లి మనుమని చెరనుండి విడిపించాడు. భీష్ముడు పులస్త్యుని వద్దకు వచ్చి పుణ్య తీర్ధముల గురించి చెప్పమని కోరాడు.
          పులస్త్యుడు భీష్మా నీ కోరిక పుణ్యఫలమైనది. గర్వములేనివారు, అల్పభోజనులు, నిత్య సంతోషితులు, సత్యవ్రతులు, ధర్మతత్పరులు, శాంతిస్వభావులు, క్షమామూర్తులు, సర్వతీర్ధముల సేవాఫలితంను యజ్ఞం చేసిన ఫలం‍నూ పొందుతారు.  అనేక పుణ్య తీర్ధములున్నవి అన్నియు చూడదగినవే. కాని, శుచి లేనివారు తీర్ధయాత్రలు చేసినా ఫలితం దక్కదు. నీవు సర్వతీర్ధములు దర్శించి అభీష్టసిద్ధిని పొందమని ఆశీర్వదించి పంపారు.

Saturday, 18 January 2014

Maitreya Maharshi


మైత్రేయ మహర్షి భూమిపై నిలిచిన గొప్ప యోగీశ్వరుడు. ఆయన దివ్య శరీర ధారి, నిర్మలమూర్తి, దర్శనమాత్రంతో సకల మోహములనుండి విముక్తికలిగించు మోహనమూర్తి. సాటి యొగులకు పూర్ణానంద స్థితిని నిలిపి భూమిపై జీవులకు యోగమార్గము ఉపదేశించుటకు వచ్చిన పూర్ణస్వరూపుడు. సిద్ధి, బుద్ధి, జ్ఞానము ఆయనకు కరతలామలకము. జ్ఞానము బోధించి యోగమును అభ్యసింపచేసి మనలను ముక్తులను చేసే యోగేశ్వరుడాయన.
          భక్తి, జ్ఞాన, వైరాగ్యములను యాగం ద్వారా పటిష్టముచేసి నిష్కామకర్మమార్గమున వేలాది జీవులను ఉద్ధరించిన కర్మనిష్టుడు. నిరంతరం పద్మాసనంన కూర్చుండి అష్టాంగ యోగమును అభ్యసించుచుండును. మనస్సు ఎప్పుడూ శ్రీ కృష్ణుని పాదపద్మములందు లీనమై ఉండును. ఆయన శరీరము పలుచనిదై కాంతికిరణములను ప్రసరిస్తూ ఉంటుంది. మైత్రేయమహర్షి కాశీరాజు దివోదాసుని కుమారుడు. వీరు చంద్రవంశమునకు చెందినవారు. వీరి మూలపురుషుడు ధన్వంతరి క్షీరసాగరమధనంలో పుట్టినవాడు. ఆయన తన సహపాటి భరద్వాజుని కూడి ఆయుర్వేదశాస్త్రము కనిపెట్టి లోకమునకు మేలుచేశారు.
          మైత్రేయుడు తండ్రి వద్ద విద్యాభ్యాసం పూర్తి అయ్యాక ఆయన ఆజ్ఞ తీసుకొని హిమాలయాలకువెళ్లి పరాశరమహర్షికి శిష్యుడై దేహమునకు తనకుగల బంధమును శాశ్వతంగా తెంచుకొని, దివ్య దేహములందు సంచరించటం అభ్యాసం చేశాడు. శ్రీ కృషునిచే కలియుగాంతం వరకూ జగద్గురువుగా నియమింపపడ్డ సిద్ధ పురుషుడు. ధర్మం అతని స్వరూపం కాబట్టి సమస్త జీవులకు ప్రేమ, కరుణ నిత్యమూ తన హస్తములనుండి ప్రసరింప చేయుచుండును. ఆయన సంచరించిన ప్రదేశములు పుణ్యతీర్థములై ఉన్నాయి. ఆయన కలాపగుహలలో ఉంటూ దైవకార్యములు చిరకాలం చేయుటకు నిశ్చయించుకున్నాడు. హిమవత్ పర్వత గర్భమున లీనమై పోయిన శంబల గ్రామము మరువు, దేవాపి మహర్షుల సాయంతో పునరుద్ధరించారు. విష్ణుపురాణము అధ్యయనం మైత్రేయునకి యాబైఏళ్లు పట్టింది. మొదటి పది ఏళ్లు రావిచెట్టు క్రింద జరిగింది. తరువాత పది ఏళ్లు బరదికాశ్రమంలో జరిగింది. తర్వాత ముప్పై సంవత్సరాలు ప్రయాగలోని కృష్ణద్వీపంలో జరిగింది. ఒక పురాణము ఇన్ని ఏళ్లు చెప్పటం, వినటం ఆ గురుశిష్యులకే చెల్లింది. వారికి వారేసాటి.
          మైత్రేయ పరాశర సంవాదమే విష్ణు పురాణము. దీనినే పరాశరుని కుమారుడు వ్యాసమహర్షి తరువాత కాలంలో పదునెనిమిది పురాణాలుగా వ్రాశారు. కలియుగంలో మైత్రేయ, విదుర సంవాదముగా భాగవతం ఏర్పడింది. రాబోవుతరం వారిని పుణ్య పురుషులుగా తయారుచేసిన వారిలో మైత్రేయుడు ముఖ్యుడు.
          సూర్యవంశమువాడగు మరువు చంద్రవంశమువాడగు దేవాపి అక్రూరుడు, సాందీపుడు, బృహస్పతి మొదలైన వారిని శ్రీకృష్ణుడు ఎన్నుకున్నాడు. శ్రీకృష్ణుడు సకల జీవుల హృదయాలలో నెమ్మదిగా నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కోలిపి వారిని వెలుగుదారిలో దివ్య స్పర్శ నిచ్చి నడిపించదలిచాడు.
          అట్టి జీవులకు ఎన్ని జన్మలెత్తినా కలిప్రభావం ఉండదు. ఈ విషయంలో ఒక సిద్ధ పురుషుని సూక్ష్మ శరీరమును వినియోగించదలచి అందుకు మైత్రేయ మహర్షిని తన సాధనముగా ఎన్నుకున్నారు.
          శ్రీ కృష్ణుడు వేణునాదం జీవులను చైతన్య పరచుట అనగా మానవుల వెన్నుపూస దండమై మురళిగా, మురళికి క్రింద ఉన్న ఆరు రంధ్రములు సాధకునిలో నిద్రాణమైన ఆరుచక్రములుగా, పైన ఉన్న రంధ్రము సహస్రారముగా చేసి వేణునాదమును జీవులలోని జడమైన కుండలినీ శక్తిని చైతన్య పరచి, క్రిందనున్న ఆరుచక్రాలు దాటి సహస్రారమును చేరే యోగసాధకులుగా మనలని మార్చే నాదమే శ్రీ కృష్ణుని వేణునాదము. ఆ స్థితిని చేరిన సాధకుని కలి ప్రభావం ఏమి చెయ్యలేదు.
          ఈ కలియుగమున యోగసాధకులుగా మరచు వేణునాదముతో చైతన్యము కలిగేవారుగా మార్చుటకు మైత్రేయ మహర్షి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
          ఈ మార్గములో తనకు తోడుగా దేవాపి, మరువు మహర్షులను ఎన్నుకున్నారు మైత్రేయమహర్షి. వీరి ముగ్గురి మహర్షుల భుజస్కందము ఆధారంగా అద్భుతమైన తేజోమయ త్రిభుజమును ఏర్పరిచారు. మైత్రేయమహర్షి కలియుగాంతం వరకూ భూమిని కాపాడుచున్నాడు. ఈ యుగములో దివ్యప్రణాళికలో జగద్గురువై నిలచారు.