Wednesday, 2 April 2014

Goutama Maharshiగౌతమ మహర్షి
          గౌతముడు బ్రహ్మ మానసపుత్రులలో ఒకడు. ఈయన గౌతమ వంశంలో జన్మించి గౌతమ మహర్షిగా పేరు ప్రతిష్టలు పొందారు. వెనుకటి కాలంలో క్షీరసాగర మధనం వేళ శ్రీహరి మోహినీరూపం ధరించగా చూచిన దేవతలందరూ బ్రహ్మ సృష్టిని అవహేళన చేశారు. అందుకని బ్రహ్మ అఖిలలోకాలలోనూ ఆశ్చర్యపోయేటటువంటి అందమైన అహల్యను సృష్టించాడు. అహల్యను గౌతమునికి సపర్యలు చేయమని ఆదేశించాడు. ఆమె అలాగే చేసింది. అహల్యకు యుక్త వయస్సు వచ్చాక ఆమె రూపం చూచి ఇంద్రుడు మొదలగు వారందరూ ముగ్దులైనారు.
          బ్రహ్మ అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహం చేద్దాం అని అనుకున్నాడు. దేవతలు నాకిచ్చి చేయమని నాకిచ్చి చేయమని ఎవరికి వారే వచ్చారు. ఆమె సౌందర్యమే అందుకు కారణం, ఈ సమస్యను ఎలా తీర్చాలా అని ఆలోచించి బ్రహ్మ ఎవరైతే ముందుగా భూప్రదిక్షణ చేసి వస్తారో వారికి అహల్యనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు. విన్న ఇంద్రాది దేవతలు ప్రదిక్షణకు బయలుదేరారు. ఈ లోపు గౌతముడు రెండు ముఖాలు కలిగిన గోవు చుట్టూ ప్రదిక్షణ చెస్తే భూప్రదిక్షణ చేసినట్లేనని చెప్పగా అది ధర్మసమ్మతమేనని బ్రహ్మ అహల్య గౌతముల కళ్యాణం వైభవంగా జరిపించాడు. తిరిగివచ్చిన దేవతలు చేసేదిలేక నూతన దంపతులను దీవించి వెళ్లారు. అహల్యను వెంటబెట్టుకొని గౌతముడు దండకారణ్య పర్వతమునకు చేరువలో నివసించసాగారు.
          చాలాకాలం బ్రహ్మను గురించి తపస్సుచేసి ఆయన ప్రత్యక్షమయ్యాక ‘నే చల్లిన విత్తనములు క్షణంలో పరిపక్వం" అయ్యే వరము కోరాడు. విధాత సరేనని చెప్పి అంతర్ధానమయ్యారు. తర్వాత ఆయన భార్యతో కలసి శతశృంగగిరికి వెళ్లి ఆశ్రమం నిర్మించుకొని ఉంటూ వచ్చిన అతిథులను పూజించి వారికి సుష్టుగా భోజనం పెడ్తూ సుఖంగా జీవిస్తున్నారు. అహల్య భర్తకు అనుగుణంగా ఉండేది. ఆ ఆశ్రమం సస్యశ్యామలమై ఉండేది. కొన్ని రోజులకు కరువు ఏర్పడింది. ఎక్కడా పంటలు లేక ఆకలిబాధతో ప్రజలు చనిపోతున్నారు.
          వర ప్రభావంతో గౌతముని భూములు మాత్రం పండుచున్నాయి. ఇది తెలిసినవారు మాత్రం గౌతమునికి అతిథులుగా వచ్చేవారు. ఈ విధంగా గౌతముని కీర్తి దశ దిశలా వ్యాపించింది. భూ మండలంలో ప్రజలు కుటుంబాలతో గౌతముని ఆశ్రమంలోనే ఉండేవారు. ఇంద్రాదులు గౌతముని కీర్తించారు. విఘ్నేశ్వరుడు బ్రాహ్మణరూపంలో వచ్చి పరీక్షీంచి చేసేదిలేక తనుకూడా అక్కడే ఉన్నాడు.
          తన తల్లి పార్వతికి బాధలేకుండా చేస్తానని అన్న వినాయకుడు గంగను భూలోకంలోకి పంపాలనే ప్రయత్నంలో ఆ పని గౌతముని వల్ల తప్ప మరెవరివల్లా కాదని భావించాడు. అనుకోవటమేకాక వెంటనే తల్లి చెలికత్తెను మాయాగోవుగా చేసి గౌతముని పొలం మేయమనీ, ఆ మహర్షి ఏంచేసినా వెంటనే చనిపొమ్మని చెప్పాడు. ఆవు చేలో మేస్తుండటం చూచి గౌతముడు గడ్డిపరకతో ఆదరించాడు. అంతే గోవు చనిపోయింది. గౌతముడు గోహత్య చేశాడు ఇక ఇక్కడ ఉంటే పాపం అని అందరూ వెళ్లిపోయారు. ఈ పాపం ఎలా పోతుందని గణపతిని అడిగాడు గౌతముడు.
          శివుని జటా జూటంలోని గంగ భూమి మీదకు ప్రవహించి ఆ గోవు తడచిన పాపం పోతుందని చెప్పాడు. శివునికోసం తపస్సు చేసి మెప్పించి భూమి మీదకు గంగను తెప్పించాడు గౌతముడు. మాయాగోవు బ్రతికింది.
          గంగకు “గౌతమి" అనే పేరు వచ్చింది. అహల్య తనకు పుత్రుడు కావాలని భర్తను కోరింది. అహల్య గర్భవతి అయి “శతానందుడు" అనే పుత్రుడుని కన్నది. తరువాత అంజని అనే కుమార్తెను కన్నది. అహల్యపై ఇంద్రుని కామదృష్టి పోలేదు. ఆ కారణంతో ఒక రోజు రాత్రి కోడి రూపం దాల్చి కొక్కురోకో అని కూయగా తెల్లవారిందని అనుకొని గౌతముడు స్నానానికి నదికి వెళ్లాడు. ఇంద్రుడు గౌతముని రూపు ధరించి అహల్యను పొందాడు. ఆ సమయంలో గౌతముడు వచ్చి చూచి అహల్యను శిలయై పడి ఉండమని, ఇంద్రుని ఒళ్లంతా కళ్లతో ఉండమని శపించాడు. గౌతముడు ఈ లోకమునకు ధర్మసూత్రములు, స్మృతి, న్యాయ, తర్క, సంహితలు వ్రాసి అందించారు. సప్త  ఋషులలో ఈయన ఒకరు.        

Monday, 24 March 2014

Ashtavakra Maharshi


అష్టావక్ర మహర్షి

ఏకపాదుడనే బ్రాహ్మణుడు నిరంతర తపోనిధుడు. ఆయన భార్య సుజాత ఉత్తమురాలు. ఏకపాదునికి ఎంతోమంది శిష్యులుండేవారు. బ్రహ్మచారులందరూ ఆయన వద్దనే ఉండి విద్య నేర్చుకొనేవారు. భార్యాభర్తలిద్దరూ శిష్యులతో హాయిగా కాలం గడుపుచున్నారు. సుజాత కొన్నిరోజులకు గర్భవతి అయింది. పుట్టబోయే బిడ్డ తండ్రి వేదములు శిష్యులకు చెప్తూవుండగా తల్లిగర్భంలో వుండి వింటూ సర్వము తప్పు నిద్రాహారములు లేకుండా శిష్యులతో చెప్పించటం తప్పు అని తండ్రికి తెలిపాడు.
తనకు పుట్టబోయే కుమారుడు దివ్య మణితుల్యుడు అని గ్రహించి సంతోషించాడు. కాని పుట్టకుండానే తనను తప్పుపట్టాడు వక్రముగా ఆలోచించాడని, ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు. సుజాత ఒక రోజున నెయ్యి, నూనె, ధాన్యం తెమ్మని చెప్పగా వాటికోసం జనకమహారాజు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పందెం జరుగుచున్నది.
          అదేమంటే వరుణుని కుమారుడు వందితో వాదమున గెలిచినవారికి సర్వం యిస్తారని,  ఓడితే జలములో మునిగి ఉండవలెనని చెప్పారు. ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయాడు. జలాశయంలో ఉండిపోయాడు. సుజాత నెలలు నిండాక ఒక కుమారుణ్ని కన్నది. ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నాడు. ఆ కారణంతో అష్టావక్రుడు అని పేరు పెట్టారు. అదే సమయంలో సుజాత తల్లికి శ్వేతకేతు అనే పుత్రుడు పుట్టాడు. అష్టావక్రుడు బాల్యం నుంచీ ఉద్దాలకమహర్షి వద్ద విద్య అధ్యయనం చేస్తున్నాడు. ఆయన ఉద్దాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావించేవారు. కొన్నిరోజులకు అసలు విషయం తెలుసుకొని జలములో ఉన్న తండ్రిని తీసుకురావాలని తల్లి ఆశీర్వాదము పొంది జనకమహారాజు అస్థానమునకు వెళ్లగా ద్వారపాలకులు ఇతనిని వెళ్లనివ్వలేదు. అనేక శాస్త్ర విషయాలు చెప్పగా దారి ఇచ్చి పంపారు. ఆయన జనకమహారాజు సమక్షంలో వందితో వాదిస్తానన్నాడు. బాలుడవు నీవేమి వాదించలేవు అన్నా వినక పిలిపించమని పట్టుపట్టాడు.
వంది వచ్చాక వాదించి గెలిచి తన శక్తి సామర్ధ్యములు తెలిపాడు. జనకమహారాజు అ బాలకుడ్ని అభినందించి మహాజ్ఞానీ ఏమి కావాలో సెలవివ్వండి అని పలుకగా తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుడ్ని చేయమని కొరాడు. వంది తన తండ్రిని జలములో ఉంచలేదని తన తండ్రిని వరుణుడు చేయు యజ్ఞము వద్దకు పంపాడని తెలిసి వందిని కీర్తించాడు. అష్టావక్రుని కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనకమహారాజు సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను అష్టావక్రుని ద్వారా తెలుసుకొని అతని పితృభక్తికి ఎంతో సంతోషించాడు. తండ్రి కూడా మెచ్చుకొని నదియందు స్నానం చేయించి కుమారుని వంకరలు పోయేటట్లు చేశాడు. అష్టావక్రుడు సుందరుడై  ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి సేవచేస్తూ ఉండిపోయాడు.
వివాహ వయస్సు రాగానే వదాస్యమహర్షి కుమార్తె సుప్రభను ఇచ్చి పెళ్ళి చేశారు. భార్యతో కలసి ఆశ్రమం నిర్మించుకొని తపస్సుచేస్తూ గృహస్థాశ్రమంలో ఉండిపోయాడు.
ఒక రోజున అష్టావక్రుడు నదిలో స్నానం చేస్తుండగా అప్సరసలు వచ్చి నృత్యగీతములని వినిపించారు. ఆయన సంతోషించి ఏం కావాలో కోరుకోమన్నాడు. వాళ్లు మాకు విష్ణుమూర్తితో స్నేహం కావాలని కోరారు.
ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుని దగ్గర గోపికలై జన్మించి స్నేహం చేస్తారని వరం ఇచ్చాడు. తరువాత అష్టావక్రుడు మనస్సును పరమాత్మయందు లయం చేసి, శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదముల వద్ద దేహత్యాగం చేశారు.
ఆయన జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్రసంహిత. ఈ పుస్తకం ఇరవై అధ్యాయములతో అనేక విషయాలు కలది. శాంతి, ఆత్మజ్ఞానం, జీవన్ముక్తులపై ఎన్నో వివరములుగల పుస్తకం. ప్రతి ఒక్కరూ చదవదగినది.

Thursday, 20 March 2014

Jamadagni Maharshi


జమదగ్ని మహర్షి
పూర్వ కాలంలో ఋచీకుడను మహర్షి ఉండేవాడు. ఆయన గాధిరాజు దగ్గరకి వెళ్లి ఆయన కూతురు సత్యవతినిచ్చి వివాహం చేయమని కోరాడు. దానికి ఆ రాజు తెల్లని శరీరము, నల్లని చెవులు గల వెయ్యి గుర్రములు తెచ్చియిస్తే పెళ్లి చేస్తానని చెప్పాడు. ఋచీకుడు వరుణ దేవుని ప్రార్థించి రాజుగారు కోరిన గుర్రములు తెచ్చియిచ్చాడు. మాట ప్రకారం సత్యవతిని ఋచీకునికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. మహర్షి భార్యను వెంటబెటుకొని ఆశ్రమంకు వెళ్లి సుఖంగా ఉంటున్నారు. సత్యవతి చేయు సేవలకు మహర్షి సంతోషించి వరం కోరుకోమన్నాడు. సత్యవతి తన తల్లికొక పుత్రుడిని తనకొక పుత్రుడిని ప్రసాదించమని కోరింది. ఆయన సరేనని మంత్ర ప్రభావంతో రెండు యజ్ఞ ప్రసాదాలను సృష్టించి మొదటిది అత్తగారికి, రెండవది భార్యకు అని చెప్పి స్నానానికి నదికి వెళ్లాడు.
          ఆ సమయంలో కూతుర్ని చూద్దాం అని గాధిరాజు భార్యతో సహా వచ్చాడు. సత్యవతి సంతోషించి తను తీసుకోవలసిన యజ్ఞ ప్రసాదాన్ని తల్లికి, తల్లి తీసుకోవాల్సిన ప్రసాదం తనూ పొరపాటున తీసుకున్నారు. అంతా దైవలీల గాధికి విశ్వామిత్రుడు, సత్యవతికి జమదగ్నిమహర్షి జన్మించారు.
జమదగ్ని పెరిగి పెద్దవాడయ్యాక యుక్త వయస్సు రాగానే రేణువు కూతురు రేణుకను ఇచ్చి పెళ్లిచేశారు. జమదగ్ని సురభి అనే పేరుగల హోమ ధేనువును సంపాదించి దాని శక్తి సామర్ధ్యములతో సుఖంగా జీవిస్తున్నాడు. ఒక రోజు పగలు జమదగ్ని రేణుకను తీసుకొని నర్మదానదీ తీరాన ఏకాంతములో ఉండుట చూచిన సూర్యుడు బ్రాహ్మణరూపంలో వచ్చి ఈ పగటి సమయలో ఇలా ఉండటం తప్పని హెచ్చరించాడు. దాంతో జమదగ్నికి కోపం వచ్చి  రాహుగ్రహస్తుడవై తేజోహీనుడవు అవుతావని శాపం ఇచ్చాడు. దాంతో సూర్యునికి కోపంవచ్చి మంచికిపోతే చెడు ఎదురైనది నన్ను అనవసరంగా శపించావు నువ్వు కూడ నా శాపం అనుభవించు, ఒక రాజుతో పరాభవింపబడి ఆయన అస్త్రములతో మరణిస్తావు అని ప్రతి శాపం ఇచ్చాడు.
జమదగ్ని, రేణుక ఆశ్రమంకు వెళ్లారు. కొంతకాలములో రేణుక రుషుణ్వతుడు, సుసేషనుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు అనే అయిదుగురు కుమారులని కన్నది. వారు పెరిగి పెద్దవారగుచున్నారు. ప్రతిరోజు రేణుక నీటికోసం ఏటికి వెళ్లి నీరు తెచ్చేది. ఓక రోజున ఆమె చిత్రరధుడనే ప్రభువు తన భార్యతో జలక్రీడలలో ఉండటం చూసి నిలబడింది. ఏమరుపాటున కుండ పగిలిపోయింది. ఖాళీ చేతులతో భార్య రావటం చూచి జమదగ్ని దివ్యదృష్టితో గమనించి మరణదండన విధించాడు. కుమారులను పిలచి తల్లిని చంపమన్నాడు. నాలుగురు పుత్రులు అంగీకరించలేదు.
పరశురాముడు ముందుకు వచ్చి తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని, అన్నలను చంపాడు. ఆతని ధైర్యానికి మెచ్చుకొని తండ్రి వరం కోరుకోమన్నాడు. తల్లిని, అన్నలను బ్రతికించమని తండ్రిని కోరాడు. పరశురాముని కోరికను మన్నించి అందరినీ సజీవులను చేశాడు జమదగ్ని మహర్షి.
కార్తవీర్యార్జునుడనే రాజు దత్తాత్రేయస్వామి వరంతో దేశం అంతా సంచరిస్తున్నాడు. ఒక రోజున సైన్యంతో జమదగ్ని ఆశ్రమంకు వచ్చాడు. ఆయన వారందరికీ పిండివంటలతో భోజనం పెట్టాడు. ఆ రాజు సంతోషించి ఈ విందు అంతా సురభి అనే అవు ద్వారా జరిగిందని తెలిసి ఆ ధేనువును తన కిమ్మని కోరాడు. జమదగ్ని ఒప్పుకోలేదు. ఆ రాజు సురభి కోసం జమదగ్ని మీద యుజ్ఞం మొదలుపెట్టాడు. జమదగ్ని సురభివైపు క్రీగంట చూడగానే అది సైన్యాన్ని సృష్టించింది. యుద్ధంలో సురభి సైన్యం ముందు రాజు సైన్యం ఓడిపోయింది. ఇక ఏమి చేయలేక జమదగ్నిని రాజు చంపాడు. సురభికోసం వెదుకగా అది అప్పటికే ఇంద్రుని వద్దకు వెళ్లిపోయింది. రేణుక సహగమనంకు సిద్ధం కాగా బృగుమహర్షి వచ్చి జమదగ్నిని బ్రతికించాడు.
వీటన్నింటికీ కారణమైన కార్తవీర్యార్జునుడనే రాజుని పరశురాముడు సంహరించాడు. ఆ వార్త తండ్రికి తెలిసి జమదగ్నితో రాజును చంపటం దోషం అనీ దాని కోసం ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేయమనీ చెప్పగా యాత్రలకు బయలుదేరాడు పరశురాముడు.
కాతవీర్యార్జునుని కుమారులు తమ తండ్రి మరణానికి కారకుడైన జమదగ్నిని పట్టి చంపారు. ఆ సమయంలో రక్షించమని తల్లి ఇరవై ఒక్కసారి పరశురాముడ్ని పిలిచింది. తీర్థయాత్రలు పూర్తి అయ్యాక వచ్చి పరశురాముడు జరిగింది తెలుసుకొని బాధపడి కోపంతో పరశువు చేతపట్టుకొని ఈ భూమి మీద రాజులందరినీ సంహరించి తండ్రికి రక్త తర్పణం చేశాడు. బృగువంశీయులందరూ క్రోధమూర్తులే.
జమదగ్ని మాత్రం శాంతి మూర్తి, క్షమాశీలి, ప్రశాంతజీవి, బృగువంశానికే మణిదీపిక. సప్త మహర్షులలో ఈయన ఒకరు.

Thursday, 6 March 2014

Ourva Maharshiఔర్వ మహర్షి
          భృగుని కుమారుడు చ్యవనుడు. చ్యవనుని పుత్రుడు అప్రవానుడు. అప్రవానునకు ఋచి అను భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. ఋచియూరువు మఋగున పుట్టినవాడగుటచే అతడు ఔర్వుడయ్యాడు. ఔర్వుడు చిన్నప్పటి నుంచి తపస్సులో ఉండేవాడు. ఆయన తపశ్చక్తి అనలముగా మారినది. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగునని అతని పిత్రుదేవతలు ఔర్వని చేరి “కుమారా నీ తపోశ్శక్తిచే జనించిన అగ్నిని సముద్రమున విడిచి పెట్టు, అది సముద్రమును దహిస్తుంది. లేకపోతే ఉపద్రవములు కలుగును" అని చెప్పగా ఔర్వుడు దానిని సముద్రంలో వదిలి పెట్టాడు. అది ఔర్వానలమై గుఱ్ఱం ముఖంతో సముద్రజలమును త్రాగింది. అదే బడబానలం తర్వాత ఆయన బ్రహ్మచర్య దీక్ష చేయసాగాడు. అంత దేవతలు, రాక్షసులు ఆ మహర్షి వద్దకు వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమని పలికారు. అందుకు అతడు ఒప్పుకోలేదు. ఔర్వని బ్రహ్మచర్య దీక్షకు ఆశ్చర్యపడి హిరణ్యకశిపుడు శ్రద్ధా భక్తులతో ఆ మహర్షికి నమస్కరించి శిష్యునిగా స్వీకరించమని కోరగా ఒప్పుకొని అతనికి వరాలు ఇచ్చి శత్రు భయం ఉండదని చెప్పిపంపాడు.
ఔర్వుడు తన తపో మహిమతో తనమోకాలి నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెకు ‘కందని’ అని పేరు పెట్టి పెంచాడు. అమె అందముగా ఉండేది కాని కలహప్రియ. యుక్తవయస్సు వచ్చాక ఆమెను దుర్వాసమహర్షి కిచ్చి పెళ్లి చేశాడు. దూర్వాసుడు భార్యతో చక్కగా ఉంటున్నాడు కాని తనకే కోపం ఎక్కువ అనుకుంటే భార్య మరీ కోపిష్టి. కటువుగా మాట్లాడుతుంది. ఉన్న కొద్ది ఆమె బాధ భరించలేక మహర్షి ఆమెను భస్మం చేశాడు. ఆ సంగతి ఔర్వునికి తెలిసి వచ్చి అల్లుడ్ని నిందించి అవమానాల పాలు అవుతావని శపించాడు. అయోధ్యను భాషుడనే రాజు పాలిస్తూండగా వేరే రాజులు దండెత్తి వచ్చి రాజ్యమాక్రమించుకున్నారు. భాషుడు నిండు గర్భవతి పట్టమహిషి అయిన భార్యతో కలిసి ఔర్వుని ఆశ్రమంకు వెళ్లాడు. ఆయన ఇంకొక భార్య తనకు గర్భం రాలేదని పట్ట మహిషికి ఎవరికి తెలియకుండా విషం పెట్టింది. ఆ సంగతి ఎవరికీ తెలియదు. ఆ విషంతో గర్భం స్తంభన అయి ఏడు సంవత్సరములు అయిన పురుడు రాలేదు. ఈ లోపు రాజు మరణించాడు. పట్టమహిషి సహగమనంకు సిద్దపడటం వల్ల ఔర్వుడు అమెను వారించాడు.
ఆమె గురువు మాట విని ఉంది. కొంతకాలానికి ఆమెకు మగబిడ్డ కలిగాడు కాని విషంతో సహా పుట్టాడు. ఆ సంగతి తెలిసి ఔర్వుడు ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. తల్లీ కొడుకూ ఆశ్రమంనందే ఉండి సమస్త విద్యలు నేర్చుకొని తల్లివల్ల విషయాలు తెలుసుకొని శత్రువుల మీదకు దండెత్తి అందర్నీ జయించి రాజ్యం పరిపాలించుచున్నాడు. సుమతి, సుకేళి అను కన్యలను పెళ్లి చేసుకున్నాడు. వారి వల్ల సంతానం కలగలేదు. భార్యలను వెంటబెట్టుకొని  ఔర్వ మహర్షి దగ్గరకు వచ్చి సంతానం కావాలని ప్రార్థించాడు. గురువు కరుణతో సుకేళికి ఒక కుమారుడు, సుమతికి అరవై మంది పుత్రులు పుట్టారు. సగరుడు సంతోషించి గురువుకు నమస్కరించి తన రాజ్యంకు వెళ్లాడు. సగరుడు చాలా కాలం రాజ్యం చేసి విసిగి గురువును తత్వ బోధన చేయమని అడిగాడు. అనేక విషయములు చెప్పారు. ఔర్వ మహర్షికి తెలియనివి లేవు మేధావి, తపోనిధి, అస్కలిత బ్రహ్మచారి, అందరికీ ఉపకారం చేసేవారు. ఈ చరిత్ర చదవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి.